ఇది అక్షరాలా నిజం. మానసిక స్వస్థత, మనం మన పనులను ప్రశాంతంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
మన జీవితాలలో శారీరక సమస్యలు ఎంత సాధారణమో, మానసిక సమస్యలు కూడా అంతే సాధారణం. కానీ మనం మానసిక సమస్య అనగానే భయపడి, ‘అసలు మానసిక సమస్యలు మనకెందుకు వస్తాయి?’ అని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాము.
ఉదాహరణకు మానసిక కృంగుబాటు గురించి వివరిస్తాను. కృంగుబాటు దరిదాపు 15% మందికి కలిగే అవకాశం వుంది. దీని లక్షణాలు వివరిస్తాను. మొదట ఏదో తెలియని భయం లాగా మొదలవుతుంది. క్రమ క్రమంగా నిరాశగా ఉండటం, ఏదో కోల్పోయిన భావన, మనసు కృంగినట్లుగా భావన ఉండటం, మనం చేసే పనులలో ఆసక్తి తగ్గిపోవడం, ఉదయం లేవగానే చిరాకుగా అనిపించడం, నిద్ర తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, శారీరకంగా కోరికలు కలగక పోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం, ఇలా బ్రతికేకంటే చనిపోవడం నయం అనే భావన కలగడం, ఆత్మహత్య చేసుకోవాలి అనే భావన కలగడం, భవిష్యత్తు అగమ్యగోచరంగా మరియు అంధకారంగా అనిపించడం – ఇవి అన్నీ మానసిక కృంగుబాటు లక్షణాలు.
యాంగ్జయిటీ / ఆందోళనా వ్యాధి – నూటికి 5 గురికి కలిగే అవకాశం వుంది. గుండె దడ, భయంతో చెమటలు పట్టడం, నోటితడి ఆరిపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చేతి / కాలి వేళ్ళు వణకడం, అర్థంలేని కీడు/శంకతో భయం భయంగా అనిపించడం, వాంతి వచ్చినట్లు అనిపించడం, కడుపు నొప్పి, గ్యాస్ వచ్చినట్లు ఉండటం, కండరాలు బిగపట్టినట్లు ఉండటం, తల తిరగడం/ దిమ్ముగా మొద్దు బారినట్లు అనిపించడం, యాంగ్జయిటీ / ఆందోళనా వ్యాధి లక్షణాలు.